Sunday, 7 July 2019

శిబి చక్రవర్తి

శిబి చక్రవర్తి

శిబి ఉశీనరుడను రాజుయొక్క కుమారుడు, మహాదాతగా పేరుపొందాడు. ఒకనాడు శిబి కూర్చునియుండగా ఒక పావురాన్ని తరుముకుంటూ ఒక డేగ వచ్చింది. ఆ పావురం గడ గడ వణకుతూ శిబి చక్రవర్తి సమీపానికి వచ్చి వాలింది. అప్పుడు అచటనున్న పురోహితుడు “రాజా! ఈ పావురం ప్రాణ భయంతో మీ శరణు జొచ్చినది'' అని అన్నాడు. జీవికి ప్రాణంకంటే ముఖ్యమైనదికాని ప్రాణదానం కంటే గొప్పది గాని మరొకటి లేదు. ఆ సమయంలో మనుష్యవాక్కులతో ఆ పావురం - "ఓ రాజా! నేనొక ఋషిని. బ్రహ్మచర్య నియమంతో వేదాధ్యయనం సాగించి పాపరహితుడనై యోగశక్తులు సాధించినవాడను. పక్షిరూపం ధరించాను. నీవు ప్రాణ రక్షకుడిగా తలచి నిన్ను శరణువేడుతున్నాను. కాన నన్ను ఆ డేగకు దానం చేయకు'' అని పల్కినది. అప్పుడు డేగ - "ఓ రాజా! నీవు దీనికి అభయమిచ్చి నా ఆహారానికి అడ్డుతగులవద్దు. నోటిదగ్గర అన్నం తీయడం నీ వంటి వానికి తగని పని" అని విన్నవించింది.

మానవ వాక్కులలో పక్షులు మాట్లాడటం శిబికి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు ఆయనకు విషమ పరిస్థితి ఏర్పడింది. ప్రాణభీతితో వచ్చిన శరణార్డికి అభయ మివ్వకపోతే రాజ్యంలో సకాలంలో వర్షాలు కురియవు. క్షామం ఏర్పడుతుంది. బాల్యమరణాలు సంభవిస్తాయి. రాజ్యం ఇంద్రాది దేవతల కోపానికి గురౌతుంది. ఇట్లు తలచి శిబి డేగను చూసి “ఓ పక్షిరాజా! ఈ పావురం కంటే బలమైన ఆహారాన్ని నా సేవకులు వండి నీకు సమర్పిస్తారు. నీకు మంచి ఆవాసం కూడా కల్పిస్తారు. ఈ పావురాన్ని విడువు" మన్నాడు. ఆ డేగ “రాజా! నేను పచనమైన ఆహారాన్ని ఇమ్మని కోరలేదు. పావురం కంటే నాకు రుచికరమైన ఆహారం లేదు. ఇది విధి నాకిచ్చిన ఆహారం కాన దానిని నాకు విడిచిపెట్టు" అని కోరింది. ఆ డేగను చూచి శిబి అనునయంగా "ఋషభకంద వేహత ఓషధులు చాల పుష్టికరమైనవి. వానిలో ఏది కోరినా నీకిస్తాను. కాని పావురాన్ని విడువను శరణుకోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం. నా స్వధర్మాన్ని సక్రమంగా పాలించాలి, కాన నీవు మరేది కోరినా ఇస్తాను" అని అన్నాడు.

అప్పుడు ఆగు"మహారాజా! ఈపావురంతో సమంగా తూగే మాంసాన్ని నీ కుడి తొడ నుండి కోసి ఇవ్వ. అప్పుడు నీ ధర్మమూ, నా అభీష్టమూ నెరవేరుతాయి" అని చెప్పగా సంతోషంతో శిబి అంగీకరించారు. వెంటనే శిబి త్రాసు తప్పించాడు. త్రాసులో ఒక పావురాన్నుంచి తన తొడను చీల్చి మాంసం కోసి మరో వైపు వేయడం ప్రారంభించాడు. ఎంత మాంసం వేసినా పావురంతో సమంగా తూగడం లేదు. క్రమంగా అవయవాలన్ని కోసే మాసం కండలు కండలు త్రాసులో ఉంచారు. అయినా పావురమే బరువుగా ఉంది. అందరి ఆశ్చర్యానికి అంతులేదు. ఇక లాభం లేదని శిబి తానే త్రాసులో కూర్చున్నాడు. పావురానికి ప్రాణరక్షణ జరిగిపోయింది అని అంటూ డేగ ఆకాశంలోనికి ఎగిరిపోయింది.
అప్పుడు శిబిపావురాన్ని చూచి నమస్కరించి - " మహాత్మా తమరు ఎవరు? మిమ్ములను మామూలు పక్షిగా నేను తలంచను" అని అనగా, ఆ పావురం అగ్నిదేవుని రూపంలో సాక్షాత్కరించి "రాజు నేను అగ్నిభట్టారకుడను. ఆ డేగ వజ్రహస్తుడైన ఇంద్రుడు మానవశ్రేష్ఠుడైన నిన్ను పరీక్షించుటకు ఈ రూపాలలో వచ్చాము" అని పలికి అతనిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యెను.
తన త్యాగంతో శిబి ఈ లోకంలో కీర్తికాయుడయ్యాడు. అంతేగాక స్వర్గంలో అతనికి శాశ్వత స్థానం లభించింది. అందువలన త్యాగేనైక అమృతత్వ మానసః అని అన్నారు

****

Saturday, 29 June 2019

మాండవ్య మహర్షి

మాండవ్యుడు :
మాండవ్యుడు ఒక బ్రాహ్మణ తపస్వి. సత్య, ధర్మములను ఆయన బహునిష్ఠ తో ఆచరించేవాడు. మౌన వ్రతంతో అయన తన ఆశ్రమ సమీపంలోగల ఒక చెట్టు నీడన శీర్షాసనంతో తపస్సు ప్రారంభించాడు. అట్లా కొన్ని సంవత్సరాలు నిశ్చలంగా ఘోర తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్న కాలంలో ఒకనాడు కొందరు దొంగలు ఆ ఆశ్రమ ప్రాంతానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. రాజభటులు వారిని తరుముకుంటూ వస్తున్నారు. ఆ దొంగలకు ఏమి చేయటానికీ తోచలేదు. వారి వద్ద నున్న దొంగిలింపబడిన వస్తువుల భారంతో వేగంగా పారిపోలేక ఆ వస్తువులను మాండవ్యని ఆశ్రమంలో దాచి పారిపోయారు రాజభటులు తర్వాత అచ్చటకు చేరారు దొంగలు ఆశ్రమంలో దాగియుంటారని భావించి ఆశ్రమాన్ని వెదికారు. అక్కడ ఆ చోరులు దాచిన వస్తువులు కనిపించినవి. బయట వెదికారు. కొద్ది దూరంలో శీర్షాసనంతో తపస్సు చేస్తున్న మహర్షి కనిపించాడు. ఒక దొంగ తమను మోసం చేయడానికే ఈ విధంగా తపస్వివలె నటిస్తున్నాడని భావించారు. వెంటనే ఆ దొంగల జాడ చెప్పమని గద్దించి అడిగారు. మౌన వ్రతంలో నున్న ముని మాట్లాడలేదు.


వారు పిదప దొంగలనందరనూ బంధించి వారితో మునిని కూడ బంధించి తీసుకువెళ్ళారు. అందరినీ రాజసముఖంలో నిలబెట్టారు. ఆచక్రవర్తి చౌర్య నేరానికి వారందరకు మరణదండన విధించాడు. అందరితోపాటు మహర్షిని కూడా ఆ రాజభటులు ఒక శూలానికి గుచ్చారు. దొంగలందరూ మరణించారు. కాని ఆ ధర్మాత్ముడు మాత్రం ఆ శూలాగ్ర భాగంలో ఆహార పానీయాలు లేకుండా చాలా కాలం తన తపశ్శక్తివల్ల జీవించి ఉన్నాడు. అట్లే ఉంటూ మాండవ్యుడు తవ తపోబలంతో ఇతర ఋషులను పిలువసాగాడు. ఆ ఋషులందరూ మాండవ్యుని పిలుపునందుకుని పక్షి రూపాలలో రాత్రిపూట వచ్చిఆ మహాత్మునికి కల్గిన దుస్థితికి విచారించి " మహర్షికి ఏ కారణం చేత నీకీ దుస్థితి కల్గినది?'' అని ప్రశ్నించారు. ఆధర్మశీల తన ప్రారబ్దమునకు మరొకరిపైనిందారోపణ చేయదల్చుకోలేదు. కొరత వేసినా మహర్షి మరణించకపోవడం, రాత్రిపూట పక్షులు వానితో సంభాషించడం రాజభటులకు ఆశ్చర్యం వేసింది. వారు వెంటనే చక్రవర్తికి ఈ విషయం తెలియజేశారు. ఆ రాజు వెంటనే వచ్చి మహర్షికి క్షమార్పణ చెప్పుకుని అనుగ్రహించమని పదే పదే ప్రార్ధించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు ఆయన శరీరం నుండి శూలాన్ని బయటకు లాగబోయారు. కాని వారి ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు మాండవ్యుడే ఆ శూలాగ్ర భాగాన్ని తన శరీరంలో ఉంచుకొని మిగిలిన భాగాన్ని నరికివేశాడు. ' శూలాగ్ర భాగాన్ని "అణి'' అని పిలుస్తారు. అణి శరీరమందు కలవాడు కాన ఆయన అణి మాండవ్యుడైనాడు. శరీరంలో శూలమున్నా ఆయన తపస్సుతో అనేక పుణ్యలోకాలను సంపాదించాడు.

ఒకనాడు మాండవ్యడు యమలోకం వెళ్ళాడు. దివ్య సింహాసనంపై కూర్చుని ఉన్న యమధర్మరాజును చూచి "యమధర్మరాజా! నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఏ పాపం చేయలేదు. అజ్ఞాన దశలో చేసిన ఏ పాపానికి నాకు కొరత వేశారో చెప్పమని కోరాడు. అంత యమధర్మరాజు మహర్షికి మీరు బాల్యంలో తూనీగలను పట్టుకుని వాటికి ముళ్ళు గుచ్చి ఆటలతో ఆనందించేవారు. దాని వల్ల మీకు ఈ స్థితి కల్గిందని చెప్పాడు. చూడండి! అల్ప దానం మహా ఫలాన్నిచ్చినట్లే స్వల్ప పాపం కూడ అత్యంత కష్టాలనిస్తుంది గదా!